టెక్నాలజీలో 'బ్రాహ్మణవాదం` vs 'స్వేచ్ఛ`...
- వేదాలను, శూద్రులు ఎట్టి పరిస్థితుల్లో చదవొద్దు. వినొద్దు. చదివితే నాలుక కోయాలి. వింటే చెవిలో సీసం పోయాలి. ఈ శిక్షల్లో ఒకదానిని స్వయంగా భగవత్స్వరూపుడిగా కొలిచే శ్రీరాముడే అమలు చేసి చూపించాడు. శంభూకుడనే శూద్రుడి చెవికి వేదాలు వినిపించాయని విశ్వామిత్రుడు కంప్లయింట్ చేయగానే రాముడు ఉన్నపళాన ఉరుక్కుంటూ వచ్పి శంభూకుడిని పడుకోబెట్టి ఆయన చెవిలో సీసం పోశాడు. ఇది పురాణం చెబుతోంది.
- దీనర్థం ఏమిటి? చదువు, విజ్ఞానం ఎట్టి పరిస్థితుల్లోనూ కిందిస్థాయి వారికి చేరకూడదు. అలా చేరితే కఠిన శిక్షలు అమలు జరపాలి. మరి ఎవరు నేర్చుకోవాలి? డబ్బున్న వర్గాలు (క్షత్రియులు, వైశ్యులు), మేథో వర్గాలు (బ్రాహ్మణ వర్గాలు) మాత్రమే నేర్చుకోవాలి. మన పురణాలు విజయవంతంగా మార్కెట్ వాదాన్ని, బ్రాహ్మణ వాదాన్ని మన సమాజంలోకి ఇంకించేశాయి. ఈ రెండింటి లక్ష్యం కిందిస్థాయిలో ఉన్నవారికి విద్యను, విజ్ఞానాన్ని అందనీయకుండా చేయడమే...
- ఓ వైపు టెక్నాలజీలో మార్పులు, అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. మరోవైపు డిజిటల్ ఇల్లిటరసీ (టెక్నాలజీ నిరక్షరాస్యత) గణనీయమైన సంఖ్యలో ఉంది. ఈ రెండు వాస్తవాల మధ్య డిజిటల్ గ్యాప్ (డిజిటల్ అంతరం) పెరిగిపోతోంది. డబ్బున్నవాడికే విద్య గరిపే `మార్కెట్ వాదం`, మేథస్సును మరొకరికి పంచనీయకుండా చేసే `బ్రాహ్మణ వాదం` పోతేనే ఈ అంతరం తగ్గుతుంది.
- మార్కెట్ వాదం.. బ్రాహ్మణ వాదం... ఈ రెండింటిలో ఏది మొండిది?... చూద్దాం... మార్కెట్ తన అవసరాలకోసం, లేదా నిరుద్యోగ సైన్యాన్ని పెంచి వేతనాలు తగ్గించుకునేందుకోసం చదువు `కొనలేని` వారికి ఉచిత విద్యను అందిస్తుంటుంది. బ్రాహ్మణ వాదానికి మాత్రం ఆ అవసరమే ఉండదు. తెలిసో తెలియకో.. టెక్నాలజీ తెలిసిన వారంతా ఈ `బ్రాహ్మణవాదం` గట్టిగా అవలంభిస్తారు.
- ఇలాంటివారు తమకు తెలిసిన టెక్నాలజీని జనంతో పంచుకోవడానికి ఇష్ట పడరు. అది తమ గుత్త సొత్తులా భావిస్తారు. చదువు `కొనడం` ద్వారా టెక్నాలజీని నేర్చుకున్నవాడిని అక్కున చేర్చుకుంటారు. చదువు `కొనలేని` వారు వేరే రంగాల్లో ఎంత ఘనత సాధించినప్పటికీ చీప్ గా చూస్తారు. చదువు`కొన`లేని వాడు స్వయంగా టెక్నాలజీ మీద ప్రయోగాలు చేస్తే వారికి సహాయం అందించరు. సరికదా... అది సరైంది కాదంటూ వేయ్యిన్నొక్క లాజిక్కులు చెప్పి గందరగోళం చేసి పారిపోయేట్లు చేస్తారు. లేదంటే తము చెప్పినట్లే నడవాలనుకుంటారు. ఇవన్నీ కాదని ఎవడైనా మొండిగా ముందుకెళ్లాడే అనుకో... ఇక వాడిమీద విషపు దాడి షురూ... విషపు దాడిని కూడా ఎదుర్కొని, నేర్చుకోవడంలో ముందుకెళ్లగలిగిన వ్యక్తి మాత్రమే 'టెక్నాలజీలో బ్రాహ్మణవాదం` నుంచి విముక్తి చెంది నిజమైన 'స్వేచ్ఛ` పొందుతాడు..
- చదువు `కొన`లేని వాడిని, టెక్నాలజీ రాని వాడిని ప్రేమతో దగ్గర తీసి, అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్లుగా వివరించి, వాడి భయాన్ని పోగొట్టే వాడు (`నేర్పేవాడు`/`టెక్నాలజీ తెలిసిన వ్యక్తి`) ఎవడైనా 'టెక్నాలజీలో బ్రాహ్మణ వాదాన్ని` వదిలేసి `స్వేచ్ఛ`గా వ్యవహరించినట్లే లెక్క.. `స్వేచ్ఛ` అంటేనే కట్టిపడేసి, ఉక్కిరిబిక్కిరి చేసి, అడుగు ముందుకేయనీయని అన్ని బంధనాల నుంచి `విముక్తి` అని అర్థం.
- సో.... `బ్రాహ్మణవాదం` నుంచి టెక్నాలజీ విద్యను `విముక్తి` చేయాలి. అప్పుడే టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, నేర్పడంలోనూ నిజమైన `స్వేచ్ఛ` లభిస్తుంది. మన దేశానికిదే కావాలి.
No comments:
Post a Comment