వైజాగ్ ఫెస్ట్.. ఓ సరికొత్త ప్రయత్నం. తెలంగాణాలో జనజాతర మాదిరిగానే, వైజాగులో వైజాగ్ ఫెస్ట్ సామాజిక జాతరాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. పుట్టిన పాపాయి తప్పటడగులు వేసినప్పటికీ, ఒక మహదాశయంతో, ప్రత్యామ్నాయ సంస్కృతిని తెలుగునాట వెదజల్లేందుకు చేసిన ఈ ప్రయత్నం బంగాళాఖాతమంత అనుభవాలను సమకూర్చిపెట్టింది. భవిష్యత్తు జాతరలకు బాట వేసింది. సముద్రంలో కాకిరెట్టలేసేవారు, వైజాగ్ ఫెస్ట్ అనే ఆకాశం మీద ఉమ్మేసేవారు అక్కడక్కడా లేకపోలేదు. వారి బందూకుల్లోని మందుగుండు జన్మస్థానంలోనే చేతులెత్తేసింది. కారణం సామాజిక మార్పు కోరుకునే శక్తులు వైజాగ్ ఫెస్ట్ అడుగులను సహృదయంతో అర్థం చేసుకుని సహకరించడమే. ఫేసుబుక్కులో జరిగిన ఓ చర్చ ఇందుకో మచ్చుతునక.
వైజాగ్ ఫెస్ట్ ఎలా జరిగింది? నాకు భాష రాదు. భావాలొలికించడం రాదు. నా తోటి ముఖపుస్తక మిత్రుడు జర్నలిస్టు శంకర్ నాకు శ్రమలేకుండా చేశారు. ముందుగా ఆయన ఒలికించిన భావాక్షరాలను ఇక్కడ యథాతథంగా పొందుపరుస్తున్నాను. ఆ తరువాత ముఖం పుస్తకంలో వైజాగ్ ఫెస్టు వైపు సామాజిక పురోగామి శక్తులు నిలబడ్డ తీరును అందిస్తున్నాను.
వైజాగ్ ఫెస్ట్ గురించి జర్నలిస్టు శంకర్
ఉత్సవాలు..వేడుకలు..వినోదాల సంబరాలు.. మనకు కొత్తకాదు..ఎగ్జిబిషన్ లు, బుక్ ఫెస్టివల్, కల్చరల్ ఫెస్టులు కూడా అక్కడక్కడా సాధారణమే..కానీ అక్కడ ఏదో ప్రత్యేకత ఉంది. ఊహించిన దానికి భిన్నమైన వాతావరణముంది. అందుకే నిత్యం వేలమంది అక్కడికి క్యూ కడుతున్నారు. సాయంత్రం వేళ సరదాగా గడుపుతున్నారు. ఒంటరిగా వచ్చిన వాళ్లు..ఇళ్లకు వెళ్లి పిల్లాపాపలతో మళ్లీ మళ్ళీ వస్తున్నారు. చుట్టు పక్కల వారిని కూడా పిలుచుకొస్తున్నారు. విద్యార్థులయితే వదలకుండా అక్కడే గడపాలనుకుంటున్నారు. ఒక్క రోజులోనే అంతా చూడడం సాధ్యం కావడం లేదు కాబట్టి పదే పదే సందర్శిస్తున్నారు. ఆ కారణంగానే అక్కడికొస్తున్న వారి సంఖ్యలో దాదాపు మూడొంతుల మంది యూత్ కనిపిస్తున్నారు. ఉల్లాసభరితమైన వాతావరణంలో వేడుకలా మారిన సందడిని ఆస్వాదించడం తమకు దక్కిన అద్భుత అవకాశంగా భావిస్తున్నారు.
ఇలా సాధారణ జనానికే అక్కడ సందడి అనుకుంటే పొరపాటు..విద్యావంతులు, అధికారోన్నతులు, సాహితీవేత్తలు, రచయితలు అందరికీ ఆ వేడుకలను చూడగానే..మంచి తరుణం మించిన దొరకదన్న చందాన కనిపిస్తోంది. ఉత్సవ వాతావరణాన్ని మించి, వివిధ వర్గాలు వేంచేస్తున్న కార్యక్రమానికి కదిలొస్తున్నారు. ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఎవరీ తరం కాదు..ఆఖరుకు ప్రభుత్వం కూడా ఇంత పగడ్బందీగా చేయలేదని చెబుతున్నారు. కొందరు ఐఏఎస్ స్థాయి అధికారులు ఈ విషయాన్ని సభాముఖంగానే వెల్లడించారు. తాము అనేకమార్లు నిర్వహించిన వివిధ వేడుకలకు అందనంత దూరంగా సాగుతున్న ఈ ఉత్సవాలు తమకో పాఠం నేర్పుతున్నాయని అంగీకరిస్తున్నారు.
అసలింతకీ అలాంటి అభిప్రాయాలకు కారణమేమిటా అంటే..అదంతా ప్రత్యామ్నాయ సంస్క్రతి కోసం పనిచేస్తున్న వారి సారధ్యంలో సాగడమే. అలాంటి సంస్క్రతిని అందరికీ అందించాలన్న తపనతో చేసిన క్రుషికి ఫలితమే. విశాఖ మహానగరంలో సాగుతున్న వైజాగ్ ఫెస్ట్ లో కనిపిస్తున్న జనసందోహమే దానికి ఉదాహరణ. రోజులు గడుస్తున్నా తరగని ఉత్సాహంతో తరలివస్తున్న ప్రజానీకాన్ని చూస్తే కలిగే అభిప్రాయమిదే. సాధారణ ఎగ్జబిషన్ లు, సర్కారు నిర్వహించే ఉత్సవాలను మించి సాగుతున్న వైజాగ్ ఫెస్ట్ చూసినవారందరిలో కలుగుతున్న అనుభూతులే. అందుకే ఆ స్థాయిలో జనం వచ్చి..జయప్రదం చేస్తున్నారు.
ఇంత పెద్ద సందడిని నిర్వహిస్తున్న తీరు కూడా చాలామందిలో అనేక అనుమానాలకు తావిస్తోంది. తొలుత ఇది ప్రభుత్వ కార్యక్రమంగా భావించిన వాళ్లకు..ప్రభుత్వమయితే ఇంత పక్కాగా ఎలా సాగుతుంది అన్న అనుమానం వస్తోంది...అయితే వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నాయా అంటే..వ్యాపారం కంటే ప్రజలకు వినోద, విజ్ణానాలు పంచడానికిచ్చిన ప్రాధాన్యత గమినిస్తే అలాంటి అభిప్రాయం నిజం కాదనిపిస్తోంది. పోనీ ఏదైన ఎన్జీవో నిర్వహిస్తుందా..అంటే అలాంటి వాతావరణం కూడా కనిపించడం లేదు.
మరి కొందరు అధికారులు చెబుతున్నట్టు నిజానికి ఏ ఒక్క నాయకుడో..ఓ వ్యక్తి వల్లనో అయ్యో పనికాదిది. అందుకే ఈ వైజాగ్ ఫెస్ట్ 2015 నిర్వహణ చూస్తేనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీని వెనుక ఉన్న ప్రత్యామ్నాయ సంస్క్రతి ఆవశ్యకత. ఏ కొందరి కోసమో..ఏ కొందరి ద్వారానో..ఏ కొందరి చేతనో కాకుండా..నిజమైన ప్రజాస్వామ్య వాతావరణానికి అద్దపట్టేలా ప్రజల చేత సాగుతున్న, ప్రజల నిర్వహణలో నడుస్తున్న, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమవుతున్న ఫెస్ట్ ఇది. అందుకే అంత త్వరగా ప్రజల్లోకి వెళ్లింది. ప్రజలను కదలించి..భాగస్వాములుగా మార్చింది. ముఖ్యంగా వివిధ ప్రజా సంఘాల కార్యకర్తల అహర్నిశల క్రుషి, వారిని ముందుకు నడుపిస్తున్న మరికొందరి అనుభవజ్ణుల ఆలోచనా సరళి కలిసి వైజాగ్ ఫెస్ట్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దాయి. అందరినీ ఆకట్టుకునే చేశాయి.
రేపటి సమాజ నిర్దేశకులుగా భావిస్తున్న యువత ఆలోచనా సరళికి అద్దంపట్టేలా వారికి ప్రత్యామ్నాయ సంస్క్రతిని పరిచయం చేసేలా సాగుతున్న వైజాగ్ ఫెస్ట్ నిర్వహణలో పాల్గొంటున్న ప్రతీఒక్కరూ అభినందననీయులే. బుక్ ఫెస్టివల్ నుంచి పబ్లిక్ సెక్టార్ పెవీలియన్ వరకూ నిర్వహణలో భాగస్వాములవుతున్న వివిధ సంస్థల ప్రతినిధులందరూ అభినందనార్హులే..కుంచె కదిపిన కార్టూనిస్టు నుంచి కదం తొక్కుతూ పదం పాడుతున్న కళాకారుడు వరకూ అందరూ ప్రశంసలకు పాత్రులే.
అయితే సాగర తీరాన ఉప్పొంగే కెరటాలతో సమానంగా ..సాయం సంధ్య వేళ వైజాగ్ ఫెస్ట్ ఆవరణలో ఉరకలెత్తుతున్న జనకెరటాల హారు ఆగకూడదు. అలల మాదిరి అలానే సాగుతూ ఉండాలి. సాంస్క్రతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఫెస్ట్ సందడి అందరికీ చేరాలి. అందుకే ప్రతీ ఏటా ఇలాంటి వాతావరణం అందుబాటులోకి రావాలి. ప్రతీ ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ కదలాలి. ఇది అందరి కోరిక. అత్యధికుల ఆశాభావం. అందుకే ఆలోచనలకు పదును పెడితే..మరికొందరిని భాగస్వాములను చేయగలిగితే ఆచరణ కష్టం కాకపోవచ్చు. ఆలోచించి చూడండి..
--వెన్నెల
వైజాగ్ ఫెస్ట్ - దాడి - ఎదుర్కొన్న పురోగామి శక్తులు